హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్సైట్, కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)లు పౌరులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నాయి.
భారత ప్రభుత్వం పీఐబీ ఆధ్వర్యంలో నకిలీ వార్తలను అరికట్టే లక్ష్యంతో 2019లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను స్థాపించింది. పౌరులు ఏదైనా వార్త ఫేక్ న్యూస్ లేదా ఒరిజినల్ న్యూస్ అని తెలుసుకోవాలంటే వాట్సాప్, ఈమెయిల్, వెబ్ పోర్టల్ ద్వారా తమ అభ్యర్థనలు పంపాల్సి ఉంటుంది.
PIBFactCheck ఎక్స్(ట్విట్టర్) అకౌంట్, PIBFactCheck ఫేస్బుక్ ద్వారా అభ్యర్థన పంపొచ్చు. లేదా Factcheck @pib. gov.in, socialmedia @pib. gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వార్త ఒరిజినలా.. లేదా ఫేకా అనేది నిర్ధారించుకున్న తర్వాత బహిరంగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వివరాలను వెల్లడిస్తుంది.
కరోనా సమయంలో ఫేక్ న్యూస్ విస్తృతంగా వ్యాప్తిచెందడంతో తెలంగాణలో ఫాక్ట్ చెక్ పోర్టల్‌ను 2020లో ప్రారంభించారు. పౌరులు ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ’లో ఫేక్, ఒరిజినల్ న్యూస్‌ను తరచి చూసుకునే వీలు కల్పించారు. తాజాగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అనేక ఫేక్ న్యూస్‌లు సోషల్‌మీడియాలో విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి.
పౌరులు ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వార్తలను గుడ్డిగా నమ్మకుండా అది ఒరిజినల్ వార్తా.. లేక ఫేక్ వార్తా అనే విషయాన్ని factcheck. telangana. gov.in వెబ్‌సైట్‌కు లేదా.. FactCheck_ Telangana ఎక్స్ (ట్విట్టర్) ఖాతాకు అభ్యర్థనలు పంపొచ్చు. ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు ఫేక్ వార్తల పట్ల అలర్ట్‌గా ఉండి.. కచ్చితమైన సమాచారాన్ని నిర్ధారణ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరాయి.