హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు,అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళామహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభిస్తారు. తిరిగి శనివారం ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుమల చేరుకున్నారు. ఆమెకు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవీ, భానుప్రకాశ్‌రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. గురువారం సాయంత్రం తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.