హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21న సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ఆమె అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్‌సిటీలోని శిల్పకళావేదికలో ‘లోక్‌మంతన్-2024’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కుల గణన సర్వేలో పాల్గొంటున్న టీచర్లను కొందరు అధికారులు వేధిస్తున్నారని, తక్షణమే వీటిని ఆపాలని పీఆర్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. సర్వే గడువును ఐదు రోజులు పొడిగించాలని కోరుతూ పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పుల్గం దామోదర్‌రెడ్డి బుధవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. కొన్ని చోట్ల ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సెలవులు దినాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే డ్యూటీల్లో ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇది సరికాదని చెప్పారు. ఒక్కొక్కరికి 150 గృహాలిస్తామని, అంత కన్నా ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించాలని, 15 కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు మంజూరుచేయాలని, అత్యవసర, ఆరోగ్యరీత్యా సెలవు పెట్టుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.