హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. శుక్రవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన భారతీయ కళా మహోత్సవ్-2025 కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పశ్చిమ రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకు భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. అంతకుముందు శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతిని బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి రాజ్భవన్లో బసచేశారు.