హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : టీఎస్ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో.. ఆర్టీసీలో ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి రాష్ట్రస్థాయిలో అవార్డులను అందజేశారు. వందరోజుల చాలెంజ్, ఎక్స్ట్రా మైల్, రాఖీపౌర్ణమి చాలెంజ్, నూతన ఆవిషరణలు తదితర విభాగాల్లో ఎంపికైన మొత్తం 650 మందికి పైగా ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఉద్యోగులను ప్రోత్సహించేందుకు, వారిలో నూతనోత్తేజాన్ని నింపేందుకు అవార్డులు ఇస్తున్నామన్నారు. నిరుడు ఆరు కొత్త బస్ డిపోలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మరికొన్ని నెలల్లో కొత్తగా 300 బస్సులు వస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 60 శాతం రోడ్డు రవాణా సంస్థలు ప్రైవేట్‌పరం అయ్యాయని, రాష్ట్రంలో ఆర్టీసీని బతికించుకోవాలనే ఆశతో అంతా కష్టపడుతున్నామని అన్నారు. సంస్థ పురోభివృద్ధి కోసం ఉద్యోగులంతా కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ఉద్యోగులంతా బాధ్యతాయుతంగా పనిచేయడంతోనే మంచి ఫలితా లు సాధిస్తున్నామని చెప్పారు. ఆరు నెలలుగా సంస్థ నష్టాల నుంచి గట్టెకుతున్నదని, పీక్ సీజన్లోనూ సిబ్బంది, అధికారులు సమష్టిగా కృషి చేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తున్నారని తెలిపారు. రాఖీ పౌర్ణమి రోజున రూ.21 కోట్ల ఆదాయం సాధించి రికార్డు నెలకొల్పామన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, తార్నాక దవాఖాన ఓఎస్డీ వీ సైదిరెడ్డి, ఈడీలు మునిశేఖర్, వినోద్, పురుషోత్తం, యాదగిరి, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.