New Voter List | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసేపనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. 18 ఏండ్లు నిండినవారి పేర్ల నమోదుతోపాటు మరణించినవారి పేర్లు తొలగించి కొత్త ఓటరు లిస్టు తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవోలు) నుంచి ఆదేశాలు వెళ్లాయి. గ్రామం యూనిట్‌గా వార్డులవారీగా ఓటర్ల జాబితాను మళ్లీ సిద్ధంచేసే పనుల్లో కార్యదర్శులు మునిగిపోయారు. సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 6న విడుదల చేసింది. ఆ జాబితాను ఎంపీడీవో లాగిన్ ద్వారా టీ-పోల్ సాఫ్ట్‌వేర్‌లో చేర్చారు. జనవరి తర్వాత గ్రామాల్లో మున్సిపాలిటీల్లో కలపడం, కొత్త మండలాలు, గ్రామాలు ఏర్పాటు కావడం వంటి కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు టీ-పోల్ సాఫ్ట్‌వేర్‌లో కొంతమంది ఓటర్ల వివరాలు క్రమానుగుణంగా కనిపించకపోవడం వల్ల కొత్త జాబితాను మొదటి నుంచి సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. గ్రామాలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్య మారే అవకాశం ఉన్నందున ఓటర్ల జాబితాను టీ-పోల్ సాఫ్ట్వేర్ నుంచి తొలగించారు. కొత్తగా రూపొందించే జాబితాను పంచాయతీ కార్యదర్శి లాగిన్ ద్వారా అప్లోడ్ చేయనున్నారు. వార్డులు, గ్రామాలు, పోలింగ్స్టేషన్ల విభజన, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) వారీగా కొత్తగా మళ్లీ ఓటర్ల జాబితాను రూపొందించడానికి కనీసం 15-20 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం.
జనవరి వరకు ఓటర్లు 3,35,27,925 మంది
తెలంగాణలో సవరించిన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 6న విడుదల చేసింది. రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు, 2,829 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ఓటరు జాబితా రూపొందించి ఎనిమిది నెలలు కావస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సవరించి, నవీకరించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని వార్డులవారీగా ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం వల్ల సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఇప్పుడు ఒక కుటుంబం ఓట్లు అన్ని ఒకే వార్డులో నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వార్డులవారీగా మళ్లీ జాబితా రూపొందిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలను సరిచేసి, ఓటర్ల వివరాలను ఎంపీడీవో లాగిన్ ద్వారా అప్‌లోడ్‌చేసే ప్రక్రియ కూడా జరుగుతున్నది.
ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వివిధ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో, ఓటర్ల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన 565 మండలాల నుంచి 564కు కుదింపు కూడా ఈ జాబితా సవరణలో భాగంగా జరుగనున్నది. తొలుత ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాలు, ఫైనల్ పబ్లికేషన్ ఇలా.. నాలుగు ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదన, నంబరింగ్, అభ్యంతరాలు, డిస్పోజల్, ఫైనల్ లిస్టు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలు పూర్తి కావడానికి కనీసం 15-20 రోజుల సమయం పట్టవచ్చు. ఇవి పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.