కంటోన్మెంట్, ఆగస్టు 4: పెండ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. అదే కత్తితో తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. జవహర్‌నగర్‌కు చెందిన గిరీశ్ (24).. బాపూజీనగర్‌కు చెందిన యువతి (22)ని ప్రేమించాడు. కొద్దిరోజులుగా తననే వివాహం చేసుకోవాలని గిరీశ్ యువతిని వేధిస్తున్నాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొద్దిరోజుల క్రితం గిరీశ్పై కేసు నమోదుచేశారు. గిరీశ్, యువతి బుధవారం కోర్టులో హాజరై రాజీపడటంతో గిరీశ్‌కు ధర్మాసనం జరిమానా విధించింది. అనంతరం ఎవరి దారినవారు వెళ్లిపోయారు. విషయాన్ని మనస్సులో పెట్టుకున్న నిందితుడు మధ్యాహ్నం యువతి ఇంటికి వెళ్లాడు. కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేస్తున్న ఆమెపై తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దాంతో బాధితురాలి నడుము, చేతిపై గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబసభ్యులు కేకలు వేయడంతో నిందితుడు అదే కత్తితో కడుపు లో పొడుచుకున్నాడు. స్థానికుల సమాచారం తో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్న దని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.