Pregnant Woman | సంగారెడ్డి : రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. ఓ నిండు గర్భిణి బురద రోడ్డులోనే 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండల పరిధిలోని ఓ గిరిజన తండాకు చెందిన నిఖిత భాయ్‌కు నెలలు నిండాయి. దీంతో ఆమెకు ఇవాళ ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. కానీ తండాకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, ఉన్న రోడ్డు బురదమయంగా మారడంతో.. అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం కష్టమైంది.
దీంతో చేసేదేమీ లేక నిండు గర్భిణి తమ తండా నుంచి 1.5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. పురిటి నొప్పులు భరిస్తూనే ఆమె బురదలో నడిచింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్‌లో కంగ్టి ఆస్పత్రికి తరలించారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.