Sangareddy | నారాయణఖేడ్/నాగల్గిద్ద, ఆగస్టు 10: తరాలు మారినా తండాల పరిస్థితి మారలేదనేది మరోసారి రుజువైంది. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అంబులెన్స్‌లు సైతం చేరుకోని ఆవాసాలు అత్యవసర పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతున్న దైన్యం సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలో వెలుగుచూసింది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను భర్త త న వీపుపై రెండు కిలోమీటర్ల వరకు మోసుకెళ్లిన ఘటన అభివృద్ధి మంత్రం జపించే పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మా రింది.
పూర్తి వివరాలిలా ఉన్నాయి. నాగల్గిద్ద మండలం మూనా తండాకు చెందిన కౌసల్యాబాయికి ఆదివారం పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ మూనా తండాకు సరైన దారి లేకపోవడంతో అంబులెన్స్ రెండు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిం ది. ఓవైపు వర్షం.. మరోవైపు తండా పొలిమేరలో వాగు ప్రవాహం.. దిక్కుతోచని పరిస్థితిలో చేసేదేమీ లేక కౌసల్యాబాయి భర్త వాసుదేవ్ ఆమెను తన వీపుపై మోసుకుంటూ రెండు కిలోమీటర్ల వరకు వెళ్లాడు. అప్పటికే పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ వద్దకు చేరుకోకముందే మార్గమధ్యలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం సిబ్బందితో పాటు ఆశ కార్యకర్త ఆమెకు అంబులెన్స్‌లో చికిత్స అం దిస్తూ కరస్‌గుత్తి పీహెచ్‌సీకి తరలించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూనా తం డాకు బీటీరోడ్డుకు నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రభుత్వం మారడంతో మూనా తండావాసుల కష్టాలు అలాగే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూనా తండావాసుల దుస్థితికి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూనా తండాకు బీటీరోడ్డు మంజూరు చేయడంతోపాటు టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడం వెనుక ఆంతర్యమేమిటి? ఈ ప్రభుత్వంపై కాంట్రాక్టర్‌కు నమ్మకం లేక పనులు చేపట్టడం లేదా? ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి నిర్లక్ష్యం మూలంగా ఓ గర్భిణికి ఈ దుస్థితి ఏర్పడింది.
-భూపాల్‌రెడ్డి,నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే