కోనరావుపేట, డిసెంబ ర్ 30 : ఇసుక అక్రమ రవాణా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మండలం మానాల పీఎస్ పరిధిలోని చింతమణి తండాకు చెందిన గుగులోత్ సుకున, నీలా దంపతుల కొడుకు గుగులోత్ గంగాధర్ (22) కూలి పనులు చేసుకుంటూ తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు.
దేగావత్ తండాకు చెందిన వినోద్ ఇసుక తీసుకు వచ్చేందుకు తన ట్రాక్టర్లో గంగాధర్‌తో పాటు మరో నలుగురు కూలీలతో మరిమడ్ల అటవీ ప్రాంతంలోని ఒర్రెలోకి వెళ్లారు. లోడ్ చేసుకుని తరలించే క్రమంలో అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిరిగి రావద్దని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లారు. అదే ప్రాంతం నుంచి మరోమారు ఇసుకను తరలించేందుకు వచ్చి ట్రాక్టర్‌లోడ్ చేసుకున్నారు.
అటవీ శాఖ అధికారులు వస్తున్నారని ట్రాక్టర్ యజమాని వినోద్ సమాచారం చేరవేయడంతో మైనర్ డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా తీసుకువెళ్లాడు. గంగాధర్ ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీ మధ్యలో నిలబడడంతో ప్రమాదవశాత్తు పడి టైర్ల కింద పడి నలిగిపోయాడు. కొ న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గంగాధర్‌ను చూసిన వారంతా వినోద్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వినోద్ అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, సిబ్బంది వచ్చి యువకుడు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే ఇసుక ట్రాక్టర్లో గ్రా మానికి తీసుకువెళ్లారు. మైనర్‌కు డ్రైవిం గ్ రాకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్లడంతో కొడుకు మృతిచెందాడని సుకన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.