హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూళ్ల గండం వెంటాడుతున్నది. మూడేండ్లు పైబడిన చిన్నారులకు నర్సరీ విద్యనందించే లక్ష్యంతో ప్రభుత్వం మరీ స్కూళ్లలో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. 2025-26 విద్యాసంవత్సరంలో వెయ్యి పాఠశాలల్లో నెలకొల్పారు. ప్రస్తుతం 2026-27లో మరో 4,131 స్కూళ్లలో ఏర్పాటుకు ఉపక్రమించింది. వీటిలో కొత్తగా చి న్నారులను ఎన్రోల్ చేయకుండా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను చేర్పించడంపై అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్లే స్కూళ్ల ప్రభావంతో పిల్లలు అంగన్వాడీల్లో చేర డం లేదని ఆందోళనకు గురవుతున్నారు.
ప్రీప్రైమరీ సెంటర్లలో ఔట్సోర్సింగ్ విధానం లో టీచర్లు, ఆయాలను నియమిస్తున్నారు. ఒక్కో సెంటర్ నిర్వహణకు ఏటా రూ.2.10లక్షలు కేటాయిస్తున్నారు. టీచర్‌కు రూ.8వేలు, ఆయాకు రూ. 6వేల చొప్పున వేతనాలు ఇస్తారు. ప్రభుత్వ వైఖరిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తప్పుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36వేల అంగన్వాడీ కేం ద్రాలుండగా ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్ల అవసరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చి న్నారులకు ఎల్కేజీ, యూకేజీ విద్యనందించాలంటే వాటి బాధ్యతను తమకే అప్పగించాలని డి మాండ్ చేస్తున్నారు. ఖజానాలో నిధుల్లేవంటున్న ప్రభుత్వం ప్రీప్రైమరీ సెంటర్ల పేరిట ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ప్రీప్రైమరీ సెంటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల నాయకులు సర్కార్‌పై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ అసంబద్ధ చర్యలతో 70వేల మంది సిబ్బంది బతుకులు రోడ్డున పడే ప్రమాదమున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రీప్రైమరీ కేంద్రాలను రద్దు చే యాలని, లేదంటే సమరభేరీ మోగిస్తామని, కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.