హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉపాధి కోల్పోయామని, హామీ మేరకు ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్‌తో ఆటోడ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆటోడ్రైవర్లు హైదరాబాద్‌కు తరలివచ్చారు. హిమాయత్‌నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయల్దేరేందుకు సిద్ధమైన ఆటోడ్రైవర్లను కాస్త ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్‌బంక్ కూడలిలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆటోడ్రైవర్లను నిర్బంధించి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆటో జేఏసీ నాయకులను ముందుస్తుగానే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల జేఏసీ నాయకులు మారయ్య, వెంకటేశ్, సత్తిరెడ్డి మాట్లాడుతూ.. ఉచిత బస్సు స్కీమ్ తీసుకొచ్చి ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా చేశారని, ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్న ప్రభుత్వం దారుణంగా మోసగిం చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలకు పిలుస్తామని మాటిచ్చిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఉద్యమం ఆగదని.. ప్రభుత్వం హామీలన్ని నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఆటోడ్రైవర్లకు ఇంత విషం ఇవ్వండి ;ఆటో డ్రైవర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు తమ చేతులతో తమ చెంపలను కొట్టుకుంటున్నామని ఆటోడ్రైవర్ల యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకోవడం కంటే ఈ ప్రభుత్వ పెద్దలే తమకు ఇంత విషం ఇవ్వాలని చెప్పారు. వెంటనే ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.12 వేలు ఇవ్వాలని కోరారు.
ఆటో కార్మికుల అరెస్ట్
నమస్తే నెట్వర్క్ డిసెంబర్ 20: సమస్యల పరిష్కారం కోసం చలో అస్లెంబీకి బయలుదేరి ఆటో యజమానులు, డ్రైవర్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్‌కు వెళ్తున్న ఆటో కార్మికులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.