భూత్పూర్, మే 16 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళాసంఘాల నాయకురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని చైతన్య మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి, ఐద్వా కార్యదర్శి పద్మ, అనురాధతోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని పాలమూరు, భూత్పూరు పీఎస్కు తరలించారు.
ఈ సందర్భంగా చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి మాట్లాడుతూ రూ.500 కోట్లతో అందాల పో టీలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో పంట కొనుగోళ్లు లేక రైతులు బాధపడుతుంటే.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ మహిళలతో విదేశీ సుందరీమణుల కాళ్లు కడిగించడం మరీ దారుణమని వారు విమర్శించారు.