హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): జూన్ 2 నాటికి రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లు లు, ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించనున్నట్టు వెల్లడించారు.
శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన జేఏసీ విస్త్రృతస్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మే 5న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేశ్, పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.