హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 7: శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని చారిత్రక వేయిస్తం భాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగుతో, 31 కేజీల పుట్టతేనెతో, 11 కేజీల ఆవునెయ్యితో, 41 కేజీల చెక్కరతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శివప్రీతికరమైన సోమవారం భక్తుల కోలాహాల మధ్య దేవాలయం కిటకిటలాడింది. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిం చారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమారాణి దంపతులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైదిక కార్యక్రమాలు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ నిర్వహించారు. ఈనెల 14వ తేదీ నుంచి ఉత్తిష్ఠగణపతి నవరాత్రిఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఏపీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, ఉమ్మడి రాష్ట్ర దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ జ్ఞాన్దేవ్రెడ్డి, రాజేంద్రం, మేడారం ఈవో వీరస్వామి, భద్రీనాథ్, అధికారులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.