న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హస్తం పార్టీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోవడం కూడా అనుమానమేనంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ కనీసం 40 సీట్లు అయినా గెలవాలని కోరుకుంటున్నా..’ అని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ఆర్థిక నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం గత పదేండ్లుగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన(వికసిత్ భారత్) దేశంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. వికసిత్ భారత్ అనేది కేవలం ఒక పదం కాదని, అది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.
దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అవాస్తవ కథనాలు సృష్టిస్తున్నదని మోదీ దుయ్యబట్టారు. దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూ పేర్కొనడాన్ని కాంగ్రెస్, కర్ణాటకలోని ఆ పార్టీ ప్రభుత్వం ఆపాలని సూచించిన మోదీ.. ఈ విధమైన వైఖరి దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో ఆ పార్టీ తన పాలనలో దేశానికి చెందిన చాలా భూభాగాలను శత్రు దేశాలకు అప్పగించిందని, మన సైన్యం ఆధునీకరణను నిలిపివేసిందని, అలాంటి వాళ్లు ఇప్పుడు దేశ భద్రతపై ఉపన్యాసాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో పార్టీ నేతలు, విధానాలకే గ్యారెంటీ లేదని, ఇప్పుడు ఆ పార్టీ మోదీ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నదని ఎద్దేవా చేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదని మోదీ అన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్ఫూర్తి పొందిన ఆ పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలస విధానాలనే అమలు చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలు కాలం చెల్లినవని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏ విధమైన రిజర్వేషన్లకైనా తాను వ్యతిరేకమంటూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గతంలో రాష్ర్టాల సీఎంలకు లేఖ రాశారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేకించి ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకమనే విషయాన్ని ఆ లేఖ చెబుతున్నదని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పనిలో ప్రమాణాలు పడిపోతాయని నెహ్రూ అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిందని అన్నారు. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల ప్రజలకు హస్తం పార్టీ పూర్తి వ్యతిరేకమని, బాబాసాహెబ్ అంబేద్కర్ గనుక లేకుండా వారికి రిజర్వేషన్లు వచ్చేవి కాదన్నారు. తన పాలనలో అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వని కాంగ్రెస్.. తమ కుటుంబసభ్యులకు మాత్రం ఇచ్చుకొన్నదని విమర్శించారు.
అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నదని, కానీ, ఆయన మాత్రం కనీసం దేన్నీ స్టార్ట్ చేయరని ఎద్దేవా చేశారు. ‘ఆ పార్టీ పదేపదే ఒకే ప్రోడక్ట్‌ను(రాహుల్‌ను ఉద్దేశించి) ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నది. అందుకే వారి దుకాణం మూతపడుతున్నది’ అని అన్నారు.