హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకుపోతారని బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా రేవంత్‌రెడ్డీ.. వాళ్లు కాదు పోయేది. ముందు మీరే జైలుకు పోతారు. మీరు విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీ దగ్గరున్న రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, స్వేచ్ఛను హరిస్తున్నారు. మీ స్వప్రయోజనాలకు ఆ వ్యవస్థలను వాడుకుంటున్నారు కాబట్టి మీరు జైలుకు వెళ్లడం ఖాయం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ అడిషనల్ డీజీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు, క్యాబినెట్ మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్ఎస్పీ మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ‘దొంగే.. దొంగా దొంగా’ అని అరిచినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉన్నదని, హోంమంత్రి, ముఖ్యమంత్రి శాఖలను తన వద్ద పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ అభద్రతాభావంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తాము మొదట్నుంచీ చెప్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మొదటిసారిగా గాంధీభవన్‌లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న కాంగ్రెస్ నేతల గురించి తెలంగాణ భవన్లో మాట్లాడాల్సి వస్తున్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం ట్యాప్ చేస్తున్నారని మూడు రోజుల క్రితం ‘సౌత్‌ఫస్ట్’ అనే పత్రిక చెప్పిందని వివరించారు. ఇద్దరు మంత్రులు సరదాగా గంట మాట్లాడుకున్న సంభాషణంతా సీఎంకి చేరిందని, కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా సీఎం చెవులకు వచ్చిందని చెప్పారు. ఈ సంభాషణలన్నీ విన్న ముఖ్యమంత్రి ఆ మంత్రుల్లో ఒకరిని పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సౌత్‌ఫస్ట్ కథనం రాసిందని గుర్తుచేశారు.
కేంద్రంలో ఉండే మోదీ, అమిత్‌షా సర్కార్.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఒక్కటే అని నిర్ధారణ అయ్యింది. రాహుల్‌గాంధీ ఫోన్‌ను కూడా మానిటరింగ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతున్నది. కాంగ్రెస్‌లోని పెద్దల ఫోన్లను కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు అనుమానం ఉన్నది.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు బీజేపీ కూడా సహకరిస్తున్నదని ఆర్ఎస్పీ తెలిపారు. ‘టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రేవంత్‌రెడ్డి సర్కారుపై యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అంటీముట్టనట్టు ఉంటున్నది. తెలంగాణలో రేవంత్ సీఎం అయిన తర్వాత ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది’ అని వాపోయారు. ఫోన్‌ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీని గురించి రన్నింగ్ కామెంట్రీ పెట్టొద్దని ముఖ్యమంత్రికి, డీజీపీకి కేంద్రం చెప్పాలని, కానీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘కేంద్రంలో ఉండే మోదీ, అమిత్‌షా సర్కార్.. రేవంత్‌రెడ్డి సర్కారు కలిసి రాహుల్ ఫోన్‌ను, కాంగ్రెస్‌లోని పెద్దల ఫోన్లను మానిటరింగ్ చేస్తున్నారనే అనుమానం ఉన్నది’ అని చెప్పారు. గాంధీభవన్ నుంచి అధిష్ఠానానికి ఇక్కడి ముఖ్యనేతలు రాసే లెటర్ల పూర్తి ట్రాన్స్క్రిప్ట్ అంతా సీఎం చేతికి వస్తున్నదంటే ఆయన ట్యాపింగ్ నెట్వర్క్ ఏస్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
‘రేవంత్‌రెడ్డి ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నరు. ప్రజలమీద, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన సాగిస్తున్నరు. సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్‌పై మాకు నమ్మకం లేదు. అది పారదర్శకంగా వ్యవహరించడం లేదు. రేపు ఏం చేయబోతున్నదనేది సిట్ పోలీసులు చెప్పరు.. హైదరాబాద్ సీపీ చెప్పరు.. డీజీపీ చెప్పరు.. కానీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో దీనిపై రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు. యూట్యూబ్ చానళ్లు దారుణంగా థంబ్‌నెయిల్స్ పెట్టి విచారణ చేస్తున్నయి. వారికి ముఖ్యమంత్రే న్యూస్ లీక్ ఇస్తున్నరు’ అని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ‘మేము న్యాయ వ్యవస్థను కోరతాం. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తాం’ అని చెప్పారు. ‘తన క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఇజ్రాయిల్ వంటి దేశాల నుంచి పెగాసస్ వంటి సాప్ట్వేర్లను వినియోగిస్తున్నారన్న ఆరోపణల మధ్య.. ఈ సిట్ పూర్తిగా కేసు భవిష్యత్తుతో విచారిస్తుందనే నమ్మకం లేదు. అందుకే దీనిని సీబీఐకి అప్పగించాలి’ అని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, గవర్నర్‌ను కోరుతామని, హైకోర్టుకు నివేదిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ వ్యవస్థలతో ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయని, దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలని కోరారు.
నడిరోడ్లపై మైనంపల్లి హనుమంతరావు, రోహిత్‌రావు అతి చేష్టలు చూస్తుంటే పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన నాకు రక్తం మరుగుతున్నది. అరేయ్ సీఐ.. ఒరేయ్ డీసీపీ అంటూ వంద థార్ కార్లతో ర్యాలీ చేస్తానని బెదిరించిన గూండాగాళ్లను గల్లా పట్టి లాక్కెళ్లి జైల్లో వేసిన పోలీసులను చూసిన. కానీ ఇట్ల నడిరోడ్లపై ఎంటర్టైన్ చేసేవాళ్లను చూడలే. నేనే యూనిఫాంలో ఉండి ఉంటే ఈ పాటికే అట్లాంటి గూండాలను గల్లాపట్టి జైల్లో వేసేవాడిని.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ప్రతిసారీ పారదర్శక పాలన అంటూ మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో? ఆ ఫోన్ల నంబర్లను సీల్డ్ కవర్లో పెట్టి ప్రతివారం హైకోర్టులో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు. ‘మీరు మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారా? ప్రతిపక్ష నేతలవి చేశారా? అధికారులవి చేశారా? ఎమ్మెల్యేలవి చేశారా? కార్పొరేషన్ చైర్మన్లవి చేశారా? అనే వివరాలు తప్పనిసరిగా ప్రతివారం సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించే దమ్ము మీకు ఉన్నదా? మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. టెలిఫోన్ ట్యాపింగ్‌లో కాంపిటెంట్ అథారిటీగా ఉండే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, చీఫ్ సెక్రటరీ జీఏడీ, లా సెక్రటరీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని చెప్పారు. ‘దీనిపై పొలిటికల్ పర్యవేక్షణ కోసం సీఎంగా మీరు, ప్రతిపక్ష నేత ఒకరు, హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ డీజీపీలతో కలిపి ట్యాపింగ్ నంబర్లను వాళ్ల దృష్టిలో పెట్టే దమ్ముందా? దానిపై వారితో కమిషన్ వేసే సత్తా ఉన్నదా?’ అని ప్రశ్నించారు. టెలిగ్రాఫ్ యాక్టు సెక్షన్-5 ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని ఆరో పించారు. ఈ కమిషన్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఫోన్‌ట్యాపింగ్‌పై సమీక్ష జరపాలని కోరారు. సిట్ నోటీసులకు తన రిప్లయ్‌ని పంపినట్టు ఆర్ఎస్పీ చెప్పారు. ‘సెలక్టివ్‌గా కొన్ని పత్రికలు, కొన్ని చానళ్లకు అధికారులు లీక్‌లు ఇస్తున్నారని చెప్పా. అది కూడా నేరం అవుతుందని చాలా క్లియర్‌గా చెప్పా’ అని వివరించారు. ‘పోలీసు ఉన్నతాధికారులకు నా సూచన ఒక్కటే.. మీరు రేవంత్‌రెడ్డి రాక్షసానందానికి బలవుతున్నరు. దయచేసి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. సీఎం అక్ర మ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను దయచేసి అడ్డుకోండి.. అని కోరారు.
రాష్ట్రంలో తెలివైన ముఖ్యమంత్రి శాంతిభద్రతల గురించి ఆలోచిస్తారని, ప్రతి నెలా పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని ఆర్ఎస్పీ చెప్పారు. రేవంత్‌రెడ్డి మాత్రం ట్యాపింగ్‌లో కేసీఆర్, కేటీఆర్ పేర్లు ఎందుకు రాలేదనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల రక్షణపై ఆయనకు స్పష్టత లేదని చెప్పారు. రాష్ట్రంలో గతంలో గన్‌కల్చర్ లేదని, ఇప్పుడు పట్టపగలే గన్లతో కాలుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేకే తన సొంత నియోజకవర్గంలో రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ఎందుకు? తక్షణం రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్రావుల అతి చేష్టలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నడిరోడ్లపై వారి చేష్టలు చూస్తుంటే పోలీసు ఆఫీసర్‌గా పనిచేసిన నాకు రక్తం మరిగిపోతున్నది. నా జీవితంలో ఏ పోలీసు కమిషనర్ కూడా ఇట్లాంటి గూండాలను, రౌడీలను ఎంటర్టైన్ చేయలేదు. ‘అరెయ్ సీఐ.. ఒరెయ్ డీసీపీ అంటూ వంద థార్కార్లతో ర్యాలీ చేస్తానని బెదిరించిన గూండాగాళ్లను గల్లా పట్టి లాక్కెళ్లి జైలులో వేసిన పోలీసులను చూశా. కానీ ఇలా నడిరోడ్లపై ఎంటర్టైన్ చేసేవాళ్లను చూడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవేళ తానే యూనిఫాంలో ఉండి ఉంటే.. ఈ పాటికే అలాంటి గూండాలను గల్లాపట్టి జైల్లో వేసేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్లకు సార్సార్ అంటూ సెల్యూట్ కొట్టే పోలీసులను చూస్తుంటే తన రక్తం మరుగుతున్నదని, కన్నీళ్లు వస్తున్నాయని వాపోయారు. ‘వాళ్లు రోడ్లమీద వేషాలేసేటప్పుడే గుంజుకపోయి సెల్లో పడేస్తే.. సీఎం రేవంత్ ఇజ్జత్, డీజీపీ ఇజ్జత్ దక్కేది’ అని చెప్పారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్‌కు కేటీఆర్ కాలినడకన వస్తే కేసు పెట్టినవాళ్లు.. ఇప్పుడెందుకు ఆ తండ్రీకొడుకులపై కేసులు పెట్టడం లేదని నిలదీశారు.