హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విప్రో అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావును ఆదివారం సిట్ అరెస్టు చేసింది. జడ్జి నివాసంలో అతడిని ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించింది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 47కు చేరింది. నర్సింగ్‌రావు గచ్చిబౌలి విప్రో లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ అందించిన మాస్టర్ పేపర్‌తో పరీక్ష రాశాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ కావడంతో డబ్బు లావాదేవీలు లేవు. నర్సింగరావు ద్వారా ఇంకా ఎంతమందికి చేరిందనే కోణంలో సిట్ విచారణ నడుస్తున్నది. పేపర్ కొన్న మరో ముగ్గురిని సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉన్నది.
డీఈ నుంచి ప్రశ్నపత్రం ఎందరికి వెళ్లింది?
వరంగల్ జిల్లా ఎలక్ట్రిసిటీ విభాగంలో డివిజన్ ఇంజినీర్ (డీఈ)గా పని చేస్తున్న రమేశ్.. పలువురికి ఏఈ పేపర్ అమ్మినట్టు తేలడంతో శనివారం సిట్ అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రమేశ్‌కు ప్రవీణ్ ద్వారా పేపర్ అందిం ది. రమేశ్ ద్వారా ఎవరెవరికి ప్రశ్నపత్రం అం దిందనే విషయంపై ఆధారాలను సేకరించిన సిట్.. మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నది. డీఈ రమేశ్ ఏఈ పరీక్ష రాసే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంతోపాటు పరీక్ష మెళకువలను తెలిపేవాడు. ఈ క్రమంలోనే పేపర్ చేతికి అందడంతో తనతో టచ్‌లో ఉన్న వారందరికీ పేపర్‌ను రూ.లక్ష నుంచి మూడు లక్షల వరకు విక్రయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.