వేల్పూర్, సెప్టెంబర్ 27: రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అదనంగా కాంగ్రెస్ సర్కారు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పంట కోతలు ప్రారంభమైనా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల జాడే లేదని, దీంతో దళారుల చేతుల్లో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో వేముల మీడియాతో మాట్లాడారు. మక్కజొన్న, సోయా పంట కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు.
మొదట్లో ప్రైవేట్ వ్యాపారులు మక్కలకు రూ.2,600 చెల్లించి కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేక క్వింటాకు రూ.300-400 వరకు నష్టపోతున్నారని చెప్పారు. ఎకరాకు రూ.60 వేల వరకు నష్టంతోపాటు కాంగ్రెస్ చెప్పినట్టు రైతుభరోసా ఇవ్వకపోవడంతో ఎకరాకు రూ.90 వేల దాకా రైతు నష్టపోతున్నట్టు చెప్పారు. మక్కకు కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ రూ.2,225 కాగా, కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ రూ.500 కలిపి రూ.2,725కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సోయాబిన్ క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి రూ.5,392 చొప్పున, వరికి అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి రూ.2,800 చొప్పున కొనుగోలు చేయాలని వేముల సూచించారు.