హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘రెండేళ్లుగా ఆర్అండ్బీ మంత్రి పదవి వెలగబెడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిందేమీలేదు.. కొత్తగా ఒక్క రోడ్డేసిందీ లేదు.. గుంత పూడ్చిందీలేదు.. ఒక్క ఇటుక పేర్చిందీలేదు.. కానీ గప్పాలు కొడుతూ కోతలరెడ్డిలా మిగిలిపోయారు..’ అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో కోమటిరెడ్డి మాట్లాడిన మాటలకు మంగళవారం ప్రశాంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిత్యం సోయి కోల్పోవడం.. మతి తప్పడం ఆయనకు అలవాటేనని చురకలంటించారు. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ కేంద్రం పరిధిలోనిదనే జ్ఞానం కూడా వెంకట్‌రెడ్డికి లేదని అన్నారు.
‘మరీ రెండేళ్లుగా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? నిధులు ఎందుకు తీసుకురాలేదు? రీజినల్ రింగ్‌రోడ్డు పనులు ఎందుకు మొదలు పెట్టలేదు?’ అంటూ ప్రశ్నించారు. ఉత్తర భాగం రీజినల్ రింగ్‌రోడ్డు పనులకు ఏడాది క్రితం టెండర్లు పిలిచారు.. నెల రోజుల్లోనే పనులు మొదలవుతాయని ప్రగల్భాలు పలికారు.. కానీ పనులేందుకు ప్రారంభంకాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉత్తమాటలు.. పిచ్చిచేష్టలు తప్ప ఆయన ఉద్ధరించిందేమీలేదని దుయ్యబట్టారు. వాగుడు తప్పా ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని దెప్పిపొడిచారు.
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలన ఫలితంగా 2014లో తెలంగాణలో జాతీయ రహదారులు 2.2 సగటుతో 2,511 కి.మీ పొడువుంటే.. కేసీఆర్ పదేండ్ల పాలనలో కేంద్రం నుంచి కొత్త రహదారులు మంజూరు చేయించి 4.45 సగటుకు పెంచారని, కొత్తగా 2,472 కి.మీ. పొడవు కలిగిన రోడ్లను వేశామని ప్రశాంత్‌రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పాలనలో ఆర్‌అండ్‌బీలో 30 లక్షల చదరపు అడుగుల భవనాలుండగా, బీఆర్ఎస్ పాలనలో కోటి అడుగులకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. 50 ఏండ్ల పాలనలో రాష్ట్రంలో 6,000 కి.మీ డబుల్ రోడ్లు ఉండగా, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా 8,000 కి.మీ రోడ్లు వేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అన్ని విషయాలు అసెంబ్లీ సాక్షిగా చూపానని, కానీ మతిమరుపు కోమటిరెడ్డి మరిచిపోయినట్టున్నారని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రికార్డులు తెప్పించుకొని చూడాలని హితవు పలికారు. దమ్ముంటే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సాధించి, కొత్త పనులకు నిధులు మంజూరు చేయించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్పై ఏడుపు మరిచి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోవడం చేతగాకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు.