నిజాంసాగర్, మే 29 : చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులదేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. అసలు తెలంగాణ అనే పదమే లేదని అడ్డగోలుగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. నర్సింహులుకు ఎంత ధైర్యమని, ఆయన తెలంగాణ బిడ్డేనా?, తెలంగాణ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఉమ్మడి జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీగౌడ్, జుక్కల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మఠం భిక్షపతి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఓటర్లతోనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు ముందే ఈ మాట అంటుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నాడే తప్ప ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. నేడు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఆజ్ఞల ప్రకారం వారి తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణను నాశనం, ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు.
నర్సింహులు అంత మాట అన్నా ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని, బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు తెలంగాణను దోచుకోవడానికి, ఇక్కడి ఆస్తిత్వాన్ని ఖతం చేయడానికి వీరంతా ఒక్కటయ్యారని విమర్శించారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూడా వేముల గుర్తుచేశారు. ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఎండిపోతుంటే ఆది తెలంగాణ వాళ్ల అసూయ వల్లేనని పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పవన్ కల్యాణ్ 11 రోజులపాటు అన్నం కూడా తినకుండా ఏడ్చాడనే విషయాన్ని గుర్తుచేశారు. ‘తెలంగాణ వాడి వేలితోనే.. తెలంగాణ వాడి కన్ను పొడిపిస్తారు’ అని నాడు కేసీఆర్, దాశరథి చెప్పిన మాటలు నిజమవుతున్నాయని తెలిపారు. బక్కని నర్సింహులు రూపంలో తెలంగాణ కండ్లను పొడిచే కార్యక్రమం జరుగుతుందని, దీనిపై ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని అహంకారంతో మాట్లాడుతున్న వారికి చారిత్రక ఆధారాలతో బుద్ధి చెప్పాలన్నారు. 4వేల సంవత్సరాల క్రితమే తెలంగాణ అనేది ’త్రిలింగ దేశం’గా విరాజిల్లిందని గుర్తుచేశారు. ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు శ్రీశైలం, ఇంకోవైపు ద్రాక్షారామం.. ఈ మూడు ప్రముఖ లింగాల మధ్య విస్తరించి ఉన్న పవిత్రమైన భూభాగమే త్రిలింగ దేశం.. అదే కాలక్రమేణా తెలంగాణగా మారిందని స్పష్టంచేశారు. అలాంటి ఘన చరిత్ర ఉన్న తెలంగాణ పదంపై ఆంధ్రా గడ్డకు వెళ్లి అపహాస్యం చేయడం సిగ్గుచేటని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పెట్టి ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిందని వేముల గుర్తుచేశారు. కేంద్రం కొనుగోలు చేస్తేనే తాము కొంటామని ఆ రోజు మ్యానిఫెస్టోలో గమనిక అని రాశారా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత రైతులను విస్మరిస్తారా? అని నిలదీశారు. చేతకాకపోతే రాజీనామా చేసి అధికారాన్ని కేంద్రానికి అప్పగించాలని సూచించారు. అప్పుడు తాము కేంద్రంతో పోరాడుతామని స్పష్టంచేశారు. కేంద్రం మీద నెపం నెట్టి తప్పుకోవాలని చూస్తే రేవంత్‌రెడ్డికి శాపం తగులుతుందని హెచ్చరించారు.