చెన్నూర్, డిసెంబర్ 30 : రాష్ట్ర మంతా అబ్బుర పడేలా త్వరలో జరుగబోయే ప్రాణహిత పుష్కరాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రాణహిత పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాణహిత నది తీరాన్ని పరిశీలించాలని ఆదేశించారు. గతంలో జరిగిన ప్రాణహిత నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, త్వరలో జరిగే పుష్కరాలకు ఎంత మంది భక్తులు రానున్నారో అంచనాకు రావాలని ఆధికారులకు సూచించారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఒక ప్రణాళికను తయారు చేసి, ఆ నివేదికను త్వరలో అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నివేదక అధారంగా ఏర్పాట్ల కోసం, అక్కడ చేపట్టే అభివృద్ది పనుల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
నిధుల మంజూరుతో పుష్కరాల కంటే ముందుగా అనుకున్న సమయానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలో నివేధిక తయారు చేసి అప్పగిస్తే, మరో సారి సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
సమావేశంలో ఇరిగేషన్, దేవాదాయ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్డు భవనాలు, విద్యుత్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.