కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా : ఈ నెల 13 నుంచి 24 వరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు కలెక్టర్ రాజేశం, వరుణ్రెడ్డితో కలిసి పుష్కర ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ లో నిర్వహించనున్న పుష్కరాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పుష్కరాలకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అన్ని శాఖల అధికారులకు చేసే పనులకు సంబంధించి లక్ష్యాలు నిర్ధేశించాలని, వాటిని నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలన్నారు.
పుష్కర ఘాట్లు, రహదారులు, అంతర్గత రహదారులతో పాటు అనుసంధాన రహదారుల పనులు పూర్తి చేయాలన్నారు. భక్తులకు కావాల్సిన తాగునీటితో పాటు ఘాట్ల వద్ద దుస్తులు మార్చుకోవడానికి స్త్రీలకు ప్రత్యేక వసతులు కల్పించాలని తెలిపారు. నీడ కోసం చలువ పందిళ్లతో పాటు పిండప్రదానాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల నిలుపుదల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీసులు బందోబస్తు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఘాట్ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక పాసులు మంజూరు చేయడంతో పాటు, వీఐపీలకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.