బూర్గంపహాడ్, జూన్ 24 : రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నదా? రాక్షస పాలన నడుస్తున్నదా? అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కోసగుంపులో ఇటీవల అటవీశాఖ అధికారుల దాడిలో గాయపడిన ఆదివాసీ గిరిజన మహిళలను మంగళవారం ఆయన ఏఈడబ్ల్యూసీఈఏ (ఆదివాసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కల్చర్ అసోసియేషన్) రాష్ట్ర నేత పొడియం బాలరాజు, ఆధార్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంబాబు, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వట్టం సుభద్ర, నేతలతో కలిసి పరామర్శించి దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు పోడు సాగుచేసుకుంటున్న గిరిజన ఆడబిడ్డల దుస్తులు చింపి, చేతులు, కాళ్లు లాగుతూ పాశవికంగా దాడికి తెగబడడం ఆటవికచర్యగా అభివర్ణించారు. 30 కుటుంబాలు 30 ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ పోడు భూములు సాగు చేసుకుంటుంటే అటవీ అధికారులు ఇప్పుడు వెళ్లి దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివాసీ మంత్రిగా ఉన్న సీతక్క, నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం, జిల్లాలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి బాధ్యత వహించే ప్రతి ఆదివాసీ ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇదని పేర్కొన్నారు.
ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించలేని వారికి పదవులు ఎందుకని, వెంటనే అందరూ రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తే.. కనీసం మంత్రి, ఎమ్మెల్యే కోసగుంపును సందర్శించకపోవడం విచారకరమని తెలిపారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ పార్టీలు అడవి బిడ్డలకు అండగా నిలబడాలని కోరారు.