హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి పీసీసీ దాకా కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఆంతర్యాన్ని గ్రహించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులకు లేఖ రాశారు.
1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీన నేపథ్యాలను గ్రహించాలని సూచించారు. ప్రజాపాలన దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మూలసూత్రాలకు, భావజాలానికి విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమే రేవంత్‌రెడ్డి బీజేపీ నినాదాన్ని ఎత్తుకున్నారనే అనుమానాలున్నాయన్నారు. చారిత్రక అంశాన్ని ప్రజాపాలనతో ముడిపెట్టి చూడటంలోనే సీఎం రేవంత్‌రెడ్డి కుట్రదాగి ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భవిష్యత్‌లో బీజేపీలో విలీనం చేసేందుకు సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మలచుకున్నారని విమర్శించారు.
బీజేపీతో భవిష్యత్ పొత్తులో భాగంగా బీజేపీ ఎజెండాను రేవంత్ సర్కార్ అమలు చేస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను బీజేపీ విమోచన దినంగా, కమ్యూనిస్టులు తెలంగాణ విమోచన దినంగా నిర్విహించాయని ఉదహరించారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని జాతీయ సమైక్యత దినోత్సవంగా పాటించి తెలంగాణలో గంగా జమునా తహెజీబ్ సంస్కృతిని పరిరక్షించిందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినం వజ్రోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని 2022లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రకటించి ప్రస్తుతం విస్మరించారని దుయ్యబట్టారు. విలీనదినం, సమైక్యతా దినోత్సవం వంటి స్థిరపడిపోయిన నినాదాలను, సంప్రదాయాలకు విరుద్ధంగా రేవంత్‌రెడ్డి ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడంలోని దూరదృష్టిని, బీజేపీ ఎత్తుగడను అర్థం చేసుకోవాలని కోరారు.