‘రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం.. తెలంగాణ సమస్త ప్రజానీకం మొత్తం ఆందోళనల పర్వం’ అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రగతిభవన్‌ను దొరల గడీ అని దొంగ ముద్రవేసి.. నాటి ఆంధ్రా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన కంచెలు బద్దలు కొట్టి.. ప్రజల భావోద్వేగంతో ఆడుకుని.. ప్రజాభవన్‌గా పేరుమార్చారు. కానీ, ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆ ప్రజాభవన్ కాస్తా.. ప్రజా ఆందోళనల భవన్‌గా మారింది. ప్రజావాణి పేరుతో జరుగుతున్న దగాను గుర్తించిన ప్రజానీకం.. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్ దద్దరిల్లేలా గర్జిస్తున్నారు. ఒక్కో వర్గపు ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. కళ్లుండీ కనిపించని, చెవులుండీ వినిపించని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజాభవన్‌లోనే నిరసనలు తెలుపుతున్నారు. ఏడాది కాలంగా ప్రజాభవన్‌లో మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, నిరసనల దృశ్యాలివి..
సెప్టెంబర్ 13 : అధికారంలోకి వస్తే విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసెత్తలేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైంది. దీంతో ప్రజావాణిలో తమ గోడు వినిపించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. రోజంతా అక్కడే బైఠాయించి, ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు
అక్టోబర్18 : కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దళితబంధును కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎగ్గొట్టడంతో ప్రజాభవన్‌లో ఆందోళనకు దిగిన దళితులు
ఆగస్టు 2 : అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేసి, బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ తర్వాత హామీని పట్టించుకోకపోవడంతో ప్రజాభవన్‌లో నిద్ర చేసి నిరసన తెలిపిన జీవో 46 బాధితులు
జనవరి 5 : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్‌రావు ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ఎదుట భిక్షాటన చేసి నిరసన తెలిపిన కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్, సభ్యులు
సెప్టెంబర్ 28 : మూసీ అభివృద్ధి పేరుతో నిరుపేదలను ముంచొద్దంటూ బాధితులు ప్రజాభవన్‌లో ఆందోళన చేపట్టారు. బాధితులకు పలు పార్టీల నేతలు మద్దతు తెలుపగా.. మూసీ బాధితుల నినాదాలతో ప్రజాభవన్ దద్దరిల్లింది.
ఫిబ్రవరి 13 : నగరంలో నీటిఎద్దడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో ప్రజాభవన్‌కు తరలివచ్చిన పలు కాలనీల మహిళలు. సెక్యూరిటీ అడ్డుకోవడంతో
ప్రజాభవన్ బయటే ఆందోళనకు దిగిన మహిళలు
అక్టోబర్ 25 : బ్యాక్లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగిన గురుకుల టీచర్స్ అభ్యర్థులు
నవంబర్ 12 : జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికై 600 రోజులు గడిచినా నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ప్రజాభవన్‌లో ఫ్లకార్డులతో నిరసన తెలిపిన జేఎల్ అభ్యర్థులు
ఆగస్టు 23 : బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని అటకెక్కించింది. రెండో విడత దళితబంధు నిధుల మంజూరు డిమాండ్‌తో ఆందోళనకు దిగిన లబ్ధిదారులు
అక్టోబర్ 15 : వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. 10 నెలలైనా అమలుకాకపోవడంతో ప్రజాభవన్‌ను ముట్టడించి నిరసన తెలిపిన వీఆర్ఏలు
అక్టోబర్ 4 : ఏపీలో మాదిరిగా తమకూ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ఎదుట నిరసన తెలిపిన కిడ్నీ బాధితులు
ఫిబ్రవరి 1 : కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన ఆటో డ్రైవర్లు.. ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డునపడ్డారు. ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగాయి. దేవ్లానాయక్ అనే ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ఎదుట తన ఆటోకు నిప్పుపెట్టి.. తాను కోరుకున్న మార్పు మంటగల్సిందని కన్నీటి పర్యంతమయ్యాడు.
మార్చి 5: అధికారంలోకి వస్తే 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ తర్వాత కాలయాపన చేస్తుండటంతో తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన అభ్యర్థులు
ఆగస్టు 2: కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రజాభవన్‌లో ఆందోళన చేస్తున్న జీవో 46 బాధితులను లాఠీచార్జి చేసి, అర్ధరాత్రి అత్యంత కర్కశంగా అరెస్టు చేస్తున్న పోలీసులు