హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికులకు చేయూతనివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిపై కత్తులు దూస్తున్నది. పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అటకెక్కించింది. ఈ పథకం కింద సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికుల కోసం నిర్మించిన వర్క్షెడ్లను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నది. ఆ షెడ్లను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నది. దీనిపై పవర్లూమ్ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం నిర్మించిన వర్క్షెడ్లను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ఎలా కట్టబెడతారని నిలదీస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని గతంలో సీఎం కేసీఆర్ భావించారు. అందుకోసం ‘వర్కర్ టు ఓనర్’ అనే సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు.
ఆ పథకం కింద అత్యాధునిక హంగులతో వర్క్షెడ్లను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా సిరిసిల్లలో 88.03 ఎకరాల భూమితోపాటు రూ.220 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో 46 వర్క్షెడ్లు, 4 వార్పిన్ షెడ్లు నిర్మించారు. వాటిలో దాదాపు 4,416 పవర్లూమ్ను ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. వాటిని 50% సబ్సిడీతో ఒక్కో కార్మికునికి 4 చొప్పున 1,104 మంది కార్మికులకు కేటాయించాలని నిర్ణయించారు. అందుకోసం లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పవర్లూమ్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోకపోగా వారి బతుకులతో చెలగాటమాడుతున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్రెడ్డి బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసి, పవర్లూమ్ కార్మికుల పొట్టలు కొట్టారు. వారికి జీవనోపాధి లేకుండా చేసి, మళ్లీ ఆర్థిక సమస్యల్లోకి నెట్టేశారు. పనోళ్లు పనోళ్లలా, యజమానులు యజమానుల్లాగే ఉండాలన్న సంకుచిత బుద్ధితో ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని నీరుగార్చారు. ఆ పథకం కింద కార్మికుల కోసం నిర్మించిన వర్క్షెడ్లను గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లా ఉపయోగించుకునేలా వ్యాపార సంస్థలకు కేటాయించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్డును విద్యుత్తు సంస్థ ఆధ్వర్యంలోని ‘సెస్’కు కేటాయించారు. మిగిలిన షెడ్లను కూడా అద్దె ప్రాతిపదిన ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కేటాయించి, దాదాపు 30 వేల మంది కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.