సూర్యాపేట, జూలై 28 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట పట్టణంలోని నిర్మలా దవాఖాన వద్ద నివాసముంటున్న దివ్యాంగుడు నజీర్ ఇంటికి విద్యుత్తు అధికారులు కనెక్షన్ను పునరుద్ధరించారు. నజీర్ ఇంటికి అధిక కరెంట్ బిల్లు రావడంతో ఆయన మొత్తం కట్టలేదు. దాంతో సిబ్బంది కనెక్షన్ను తొలగించారు. ఈ ఘటనపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గృహజ్యోతికి గ్రహణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు ట్రాన్స్కో అధికారులు స్పందించారు.
ఉదయం నజీర్ ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకొని వెంటనే కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. 24 గంటల్లోపే తన సమస్య పరిష్కారమవడంతో నజీర్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయమై ఆదివారం సూర్యాపేటలోని ఎస్ఈ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఈ పాల్రాజ్ మాట్లాడుతూ.. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తేనే బిల్లు వస్తుందని, లేకుంటే జీరో బిల్లు వస్తుందని తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నజీర్ 2023 డిసెంబర్ నుంచి బిల్లులు చెల్లించడం లేదని, దాంతో ఆయన బిల్లు ఎక్కువగా ఉందని, కొంత కొంత చెల్లిస్తున్నాడని తెలిపారు.