హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ): నిత్యం రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న వ్యవసాయ మార్కెట్లకు పెండింగ్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. నెలలుగా అధికారులు, సిబ్బంది వేతనాలు, విద్యుత్తు, నీటి సరఫరా బిల్లులతోపాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనా అవసరాల బిల్లులను కూడా చెల్లించలేని దుస్థితి మార్కెటింగ్ శాఖ ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని 205 మార్కెట్లలో సుమారు 2,300 మంది వరకు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 500 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా, మిగతా 1,800 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
మార్కెట్ల విద్యుత్తు బిల్లులు దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పేరుకుపోయాయి. ఈ కారణంగా రాష్ట్రంలోని దాదాపు 50 మార్కెట్లలో విద్యుత్తు అధికారులు సరఫరాను నిలిపివేశారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా అయిన ఖమ్మంలోని మార్కెట్లకు కూడా విద్యుత్తు సరఫరాను తొలగించడం గమనార్హం. మార్కెట్లకు సరఫరా చేసిన వాటర్ బిల్లులు కూడా చెల్లించలేక పోవడంతో కాంట్రాక్టర్లు తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో కొన్ని మార్కెట్లలో అధికారులు అప్పులు చేసి విద్యుత్తు, నీటి సరఫరా బిల్లులు చెల్లిస్తున్నారు.
ట్రెజరీలలో వందలాది కోట్లు మూలుగుతున్నా నెలవారీగా బిల్లులను విడుదల చేయడంలో ఆర్థిక శాఖ కొర్రీలు పెడుతుండటంతో మార్కెటింగ్ శాఖ సెక్రటరీలు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోని వివిధ మార్కెట్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి రెండేండ్లుగా సక్రమంగా సమయానికి వేతనాలు అందడం లేదని వారే చెప్తున్నారు.
మార్కెటింగ్ శాఖకు 1966 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. మార్కెట్లలో రోజువారీగా జరిగే క్రయవిక్రయాల ద్వారా వచ్చే నిధులను నిత్యం ట్రెజరీలలో జమ చేస్తారు. వాటి నుంచి తిరిగి నెలనెలా మార్కెట్ల వారీగా బిల్లులు పెట్టి సిబ్బంది వేతనాలతోపాటు కార్యాలయ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తారు. కానీ రెండేండ్ల నుంచి ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చినట్టు అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ట్రెజరీల నుంచి బిల్లులు నెలల తరబడి మంజూరు కాకుండా ఆర్థిక శాఖ తన నియంత్రణతో అడ్డుకుంటున్నదని వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 205 మార్కెట్లు ఉండగా, దాదాపు 1800 మంది ఆవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. యార్డ్ క్లీనింగ్, అటెండర్లు, ఇతర ఉద్యోగులే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనంతో పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ఆదాయం రూ.450 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.800 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నది.
కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారు 4 నెలల నుంచి సిబ్బందికి వేతనాలను నిలిపివేశారు. దీంతో వేతనాలు అందకపోవడంతో పూట గడవని సిబ్బంది విధులను బహిష్కరించేందుకు సిద్దమైనట్టు సమాచారం.అంతేగాకుండా రెండేండ్ల నుంచి గోదాముల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ కూడా 3 నెలలుగా నిలిచిపోయింది.