హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో 48 స్టోన్ క్రషింగ్, మినరల్స్ పరిశ్రమలకు విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఆ పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, సీఈఐజీ సర్టిఫికెట్లు, స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రాలు, ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్లు లేవని, లేబర్ లైసెన్సుల గడువు ముగిసిందని సాకుగా చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా కరెంట్ కనెక్షన్లు కట్ చేసింది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం ఉన్నదని, ఆ నేత ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపట్టామని దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) ఉన్నతాధికారి ఒకరు బాహాటంగానే చెప్తున్నారు. దీనిపై ఆ పరిశ్రమల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ కరెంట్ కనెక్షన్లు తొలగించడం ఏమిటని మండిపడుతున్నారు.
అధికారులు అడుగుతున్న సర్టిఫికెట్లన్నీ గతంలో విద్యుత్తు కనెకషన్లకు దరఖాస్తు చేసుకున్నప్పుడే సమర్పించామని, ఆ సర్టిఫికెట్లు చూపాలంటూ ఇప్పుడు మళ్లీ తమను అడగడమేంటని మండిపడుతున్నారు. ఒకవేళ ఆ పత్రాలు కావాలంటే సంబంధిత శాఖల అధికారులు కాకుండా విద్యుత్తు శాఖ సిబ్బంది అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ సర్టిఫికెట్ల విషయంలో తాము ఏమీ చేయలేమని, సర్టిఫికెట్లు లేని పరిశ్రమలకు విద్యుత్తు కనెక్షన్లు తొలగించాలంటూ తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని స్థానిక విద్యుత్తు సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ కూడా ఇదే సమాధానం ఇచ్చినట్టు సమాచారం. కరెంట్ ఆపేస్తే ఉత్పత్తి ఆగిపోతుందని పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేయడంతో.. నెల రోజుల్లోగా అన్ని సర్టిఫికెట్లు సమర్పించాలని, లేకుంటే విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆ పరిశ్రమల నిర్వాహకుల నుంచి ఓ అంగీకార పత్రం తీసుకున్నట్టు తెలిసింది.
సాధారణంగా పరిశ్రమలకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చే ముందే వాటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేవో అధికారులు ప్రరిశీలిస్తారు. సరైన అనుమతులు లేని పరిశ్రమల దరఖాస్తులను తిరస్కరిస్తారు. కనెక్షన్లు పొందిన పరిశ్రమల నిర్వాహకులు సక్రమంగా బిల్లులు చెల్లించనప్పుడు లేదా అక్రమంగా విద్యుత్తును ఉపయోగించుకున్నప్పుడే అధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వివిధ విభాగాల నుంచి పరిశ్రమలు పొందిన పత్రాలను పరిశీలించి, వాటికి విద్యుత్తు కనెక్షన్లు కొనసాగించాలో లేదో నిర్ణయిస్తున్నారు.