హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. మూడు రోజుల క్రితం బాచుపల్లి, రెండురోజుల క్రితం రాజేంద్రనగర్, జీడిమెట్ల, తాజాగా బోడుప్పల్లో విద్యుత్తు కోతలతో స్థానికులంతా సబ్స్టేషన్లను ముట్టడిస్తున్న పరిస్థితులు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 5.20 గంటల నుంచి రాత్రి 10.25 నిమిషాల వరకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తడంతో స్థానికులంతా కలిసి బోడుప్పల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రెండు రోజుల క్రితం ఇదే తరహాలో బాచుపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగి ధర్నాలు చేశారు.
రాజేంద్రనగర్‌లోని కిస్మత్పూర్ సెక్షన్, జీడిమెట్లలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో అర్ధరాత్రి గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నది. గ్రేటర్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు విద్యుత్తు సరఫరా వ్యవస్థ తీరుకు అద్దం పడుతున్నాయి.
ఏటా వర్షకాలంలో ఈదురుగాలుకు చెట్లు, కొమ్మలుపడి విద్యుత్తుకు అంతరాయం కలగటం కామన్. అయినప్పటికీ, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు విద్యుత్తుశాఖ యంత్రాంగం సిద్ధంగా లేకపోవటానికి పై సంఘటనలే ప్రత్యేక నిదర్శనమని విద్యుత్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఒకేసారి ఎక్కువ చోట్ల చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు, స్తంభాలపై పడటంతో పునరుద్ధరణలో ఆలస్యమైందని చెప్తున్న అధికారులు.. సమస్య తీవ్రతకు అనుగుణంగా ప్రత్యేక బృందాలతో పనులు చేపట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
టీజీఎస్పీడీసీఎల్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఇచ్చిన వివరణలోనూ సాయంత్రం 5.20 నుంచి రాత్రి 10.25 వరకు పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపింది. అయినా, కరెంటు కోతలు లేవని సీఎం రేవంత్ చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నదని వినియోగదారులు మండిపడుతున్నారు.
ఈర్లపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్థులు
చేవెళ్ల రూరల్ : విద్యుత్తు కోతలపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కేపల్లివాసులు మండిపడ్డారు. విద్యుత్తు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాత్రులు నిద్రపట్టడం లేదని, అరుగులపై కూర్చోవాల్సి వస్తున్నదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహిస్తూ సోమవారం ఈర్లపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. ఈర్లపల్లి, ఎన్కేపల్లి, గొల్లగూడ, కమ్మెట గ్రామాలకు ఈర్లపల్లి సబ్‌స్టేషన్ నుంచే కరెంట్ సరఫరా అవుతున్నదని.. ఎన్కేపల్లికి తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతున్నదని తెలిపారు. తమ గ్రామానికే విద్యుత్తు సరఫరాలో కోత విధిస్తున్నారని పలువురు రైతులు, ప్రజలు మండిపడ్డారు.
రాత్రివేళల్లో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. లైన్‌మన్‌కు ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాతున్నాడని, పైఅధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాగా చేవెళ్ల ఏఈ జానీమోహినుద్దీన్ స్పందిస్తూ వర్షం, ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతున్నదని తెలిపారు. వీలైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.