ధర్మపురి, మార్చి 27 : బీసీ కులాల్లో ఉన్న దొమ్మర, వీరముష్టి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మపురికి వ చ్చిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం విద్యుత్ సరాఫరాలో అంతరాయం ఏర్పడడంతో చీకట్లోనే దొమ్మర సామాజిక వర్గానికి చెందినవారి వ్యథను కమిషన్ సభ్యులు విన్నారు. కెమెరా లైట్ఫోకస్ కిందనే స్థితిగతులను నోట్ చేసుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ధర్మపురికి చేరుకున్నారు.
దుర్గాకాలనీలో సాయంత్రం 6.15 గంటలకు సమావేశం ప్రారంభమైంది. 6.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సాయంత్రం 7గంటలకు వరకు చీకట్లోనే సమావేశం సాగింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయి, హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా, ప్రొటోకాల్ కలిగిన బీసీ కమిషన్ చైర్మన్ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్టు కనిపించింది.