ముదిగొండ, అక్టోబర్ 4 : ఖమ్మం జిల్లా ముదిగొండ (Mudigonda) మండలానికి చెందిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) మేకపోతుల శ్రీనివాస్ ఈ నెల 1న ఆకస్మికంగా బదిలీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 22న మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ( Bhatti Vikramarka) ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత సభ నిర్వహించి పలువురిని పార్టీలో చేర్చుకున్నారు.
ఈ కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో గాలిదుమారం, భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరాలో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో పదిరోజుల తర్వాత ఏఈకి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్పోతున్నా పట్టించుకునేవారు లేరని, డిప్యూటీ సీఎం ప్రోగ్రాంలో ప్రకృతి విపత్తుతో ఐదు నిమిషాలు కరెంట్పోతే చర్యలు తీసుకుంటారా అని బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నాలు నిర్వహించారు. చిన్న విషయానికి ఏఈని మారుమూల ప్రాంతానికి బదిలీ చేయడం ఏమిటని, ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయాలని ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.