హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశమైన వెంటనే ఎలాంటి చర్చ కూడా లేకుండానే 3 గంటలపాటు వాయిదా వేయడం ఏమిటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అసెంబ్లీని వాయిదా వేసి క్యాబినెట్ సమావేశంలో గంటల తరబడి చర్చలు చూస్తుంటే ఎలాంటి ప్రభుతం నడుస్తున్నదో, పరిపాలన ఎలా ఉన్నదో అర్థమవుతున్నదని మండిపడ్డారు. ‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఇలాంటి చర్యలు చూస్తుంటే ఆవేదనగా ఉన్నది’ అని మంగళవారం ఒక ప్రకటనలో వాపోయారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాల ఆమోదం అనంతరం శాసనమండలి చైర్మన్ సభను నిరవధికంగా వాయిదావేశారు. మొదట బీసీ కులగణనపై చర్చ సందర్భంగా కులగణన తప్పుల తడకగా ఉందని పేర్కొంటూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కులగణన నివేదికను సభ ఆమోదిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ఎస్సీ కులగణనపై చర్చించి ఆమోదం తెలిపారు.