హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్ పరీక్షనాటికి ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’పై వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించాలని, సాధ్యంకాని పక్షంలో మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని కోరారు. శుక్రవారం ఆయనకు వేర్వేరుగా లేఖలు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 మెయిన్ పరీక్ష అక్టోబర్ 21న ఉన్నదని అభ్యర్థులు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’లో దొర్లిన తప్పులపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారని గుర్తుచేశారు. ఆ కేసులన్నింటినీ మెయిన్ పరీక్షనాటికి పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీ సంతోష్, ప్రశాంత్‌రెడ్డి, సాయికృష్ణ, నరేశ్, అరుణ్‌కుమార్, నిశాంత్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, రవి, భద్రు, చంద్రమౌళి, వినోద్‌కుమార్, కిరణ్, సంపత్ పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గుర్తింపు పొందిన కాలేజీలోనే విద్యార్థులు చేరాలని ఇంటర్‌బోర్డు సూచించింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని, వాటిలోనే అడ్మిషన్లు పొందాలని కోరింది. ‘ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం’ పేరుతో శుక్రవారం నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. ఇప్పటివరకు 340కి పైగా కాలేజీలు గుర్తింపును దక్కించుకోకపోవడం, ఆయా కాలేజీల్లో లక్షలకుపైగా విద్యార్థులున్నారని ప్రస్తావించింది. దీంతో ఇంటర్‌బోర్డు డైరెక్టర్ శృతి ఓజా శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును 7 వరకు పొడగించామని పేర్కొన్నారు. ఇదే చివరి అవకాశమని, అర్హులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.