హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. వరుసగా పాఠశాలల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి రావడమే ఇందుకు కారణం. రోజుకో కార్యక్రమం.. పూటకో శిక్షణ అన్నట్టు.. రాష్ట్రంలోని బడుల పరిస్థితి తయారైంది. నెలలో ఆరేడు రోజులు సెలవులే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇది చేయండి.. అది చేయండి అంటూ ఆదేశాలు.
దీంతో తాము చదువు చెప్పేదెప్పుడు.. విద్యార్థులు నేర్చుకునేదెప్పుడు? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు నెలంతా వర్షాలు, వరదలు, వైరల్ ఫీవర్ సెలవులతోనే గడిచిపోయింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటపోటీలు, పాఠశాలల్లో మొక్కలు నాటడం, హిందీ దినోత్సవం, హౌజ్సిస్టం, స్టూడెంట్ కౌన్సిల్, ఇన్స్పైర్ నామినేషన్లు, హరిత విద్యాలయ రేటింగ్స్ వంటివి అంటగట్టారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు విద్యాబోధనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
డీఎల్ శిక్షణను వాయిదావేయండి : ఎస్టీయూ
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కార్యక్రమాలు, శిక్షణల పేరిట సమయాన్ని వృథా చేస్తున్నారని ఎస్టీయూ ఆరోపించింది. ఇలాంటి వాటికి ముగింపు పలకాలని కోరింది. సెప్టెంబర్‌లో ఇప్పటికే విలువైన కాలం గడిచిపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది. ఎఫ్ఏ-1 పరీక్షలు, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లున్నందున డిజిటల్ లెర్నింగ్(డీఎల్)శిక్షణ కార్యక్రమాన్ని వాయిదావేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు భీమనాథుని రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.