హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(దక్షిణ డిస్కం-SPDCL)లో పోస్టింగ్స్, అదనపు బాధ్యతలప్పగించడం వింతలను తలపిస్తున్నది. ఒక క్యాడర్ పోస్టుకు అంతకు పైస్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించగా, మరో క్యాడర్లో అంతకు కిందిస్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు ఘటనల్లోనూ సమాన క్యాడర్ అధికారులుండగా, వారికి అప్పగించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 31న మేడ్చల్ జోన్ పరిధిలోని సంగారెడ్డి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) శ్రీనాథ్ ప దవీ విరమణ పొందారు. ఆపరేషన్స్ విభాగంలో ఎస్ఈ పోస్టు కీలకం. సమానస్థాయి అధికారిని బదిలీచేసి, పోస్టింగ్ ఇవ్వవచ్చు లేదా ఇదే డివిజన్లోని సీనియర్ అధికారి లేదా అదే డివిజన్లోని ఇతర విభాగాల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ సంగారెడ్డి ఎస్ఈ పోస్టుకు మేడ్చల్ జోన్ సీఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న కామేష్‌కు ఇన్చార్జి బాధ్యతలప్పగించారు. పైస్థాయిలోని సీఈకి ఎస్ఈగా అదనపు బాధ్యతలప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి ఆపరేషన్స్ డివిజినల్ ఇంజినీర్(డీఈ) పోస్టింగ్ విషయంలో మరోలా వ్యవహరించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఈ సురేందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. ఈ డీఈ పోస్టును అడిషనల్ డివిజినల్ ఇంజినీర్(ఏడీఈ)కి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఈ హోదా గల నలుగురు ఇంజినీర్లు అదే డివిజన్ పరిధిలో ఉన్నారు. డీఈ టెక్నికల్, డీఈఎంఆర్టీ, డీఈ టీఆర్లున్నారు. కానీ వారిని కాదని కింది స్థాయి అధికారి అయిన ఏడీఈకి అదనపు బాధ్యతలప్పగించారు. అంటే ఈ నలుగురు డీఈలు అసమర్ధులని అధికారులు భావిస్తున్నారా..? అన్న చర్చ డిస్కం అధికారుల్లో నడుస్తున్నది.