చెన్నూర్ రూరల్/బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్, జనవరి 5 : రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా హామీని అమలు చేయకపోగా.. తాజాగా ఎకరాకు రూ.12 వేలే ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ తీరును నిరసిస్తూ మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల వాల్పోస్టర్లు వెలిశాయి. ఎటువంటి షరతులు, కొర్రీలు రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు వాల్ పోస్టర్లు అంటించారు.
‘ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడిస్తావు రేవంత్? 2023 యాసంగిలో ఒక్కో ఎకరాకు ఎగ్గొట్టిన రైతు భరోసా రూ.2500.. 2024 వానకాలంలో రూ.7500.. 2024 యాసంగిలో రూ.7500.. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఒక్కో ఎకరాకు బాకీ పడ్డ రైతు భరోసా రూ.17,500 ఇవ్వాలని’ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను చూపిస్తూ రైతులు మాట్లాడారు. మళ్లీ సర్వే, దరఖాస్తు స్వీకరణ సాకుతో ఈసారి కూడా రైతు భరోసాను ఎగ్గొట్టే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉందని మండిపడ్డారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని వేడుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని కర్షకులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ మాదిరిగా కాకుండా రైతు భరోసా డబ్బులను ఒక్కసారే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఎకరాకు రూ.7,500 ఇస్తామని, నేడు ఎకరాకు రూ.6 వేలు ఇస్తానడం సిగ్గుచేటని అన్నారు.