వరంగల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగరం 56వ డివిజన్లోని జవహర్‌కాలనీ రోడ్డు, మారుతీ కాలనీలోని ఖాళీప్లాట్లలో ఓ మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు మంగళవారం రాత్రికిరాత్రే ట్రాక్టర్లతో సిమెంటు ఖనీలు తెచ్చివేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొన్ని ఖనీలను కాలనీ 7వ నంబరు రోడ్డు వెంట, ఖాళీ ప్లాట్లు, ఇండ్ల ముందు పాతారు. వీటిపై ఎర్ర రంగుతో కేఎం అని రాసి ఉన్నది.
అక్కడక్కడా కొన్ని ఖనీలు వేసి వాటిని గురువారం వచ్చి పాతుతామని సదరు అనుచరులు బహిరంగంగానే చెప్పారు. కాలనీలోని ఏరియా తమ నాయకుడిదేనని, రికార్డుల్లో ఆయన పేరే ఉన్నదని, కొందరు ఇండ్లు కట్టుకున్నా ఏమీ అనలేదని, ఖాళీ ప్లాట్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఓ మంత్రి భర్త, మాజీ ప్రజాప్రతినిధికి ఈ ప్రాంతంలో విశాల ఫామ్‌హౌస్ ఉన్నది. దీనికి సమీపంలోనే మారుతీకాలనీ ఉన్నది. రికార్డుల ప్రకారం కాలనీ భూమి తన పేరిటే ఉన్నదని, భూములకు తగి డబ్బు ఇవ్వాలని అప్పట్లో ఆయన హెచ్చరించిన ట్టు స్థానికులు చెప్తున్నారు. అధికారం రాగానే ఇప్పుడు పలుకుబడితో ఇలా చేయడం సమంజసం కాదని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.