హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందచేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికుల నియామకం, మోడల్ స్కూళ్ల టీచర్ల బదిలీ, ఉచిత విద్యుత్, 317 జీవో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తూ మరణించిన కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం, పీఆర్సీ, డీఏ డిమాండ్లపై సలహాదారు సానుకూలత వ్యక్తం చేసినట్టు టీటీజేఏసీ చైర్మన్ తెలిపారు. కమలాకర్‌రావు, రాజగంగారెడ్డి, రాఘవరెడ్డి, అబ్దుల్లా, రమేశ్, సాగర్, అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.