హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ): భూభారతి అమలుపై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన మూడు మండలాల్లో ఈ నెల 14న భూభారతి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం భూభారతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పోర్టల్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఎంపికచేసిన మూడు మండలాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు.