హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు (Delimitation) జనగణన (Census) ప్రధాన అడ్డంకి కాబోతున్నదా? జనాభా లెకల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయా? అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన షెడ్యూల్-2027 ప్రకారం చూస్తే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం రెండు విడతలుగా సాగే జనాభా గణన తొలి దశ ప్రక్రియ 2026 ఏప్రిల్లో ప్రారంభమై, ఆయా రాష్ర్టాల వెసులుబాటును బట్టి సెప్టెంబర్లో ముగుస్తుంది. రెండో దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో మొదలై, 2027 మార్చి 31 నాటికి ముగుస్తుంది. ఈ రెండు దశల్లో సేకరించిన దేశ జనాభా తాతాలిక లెక్కలు 2027 చివరి నాటికి అందుతాయని అంచనా వేస్తున్నారు.
పూర్తిస్థాయి జనాభా లెక్కలపై 2028 చివరి నాటికి తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంచనా వేస్తున్నది. తుది నోటిఫికేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోం శాఖ అధికారులు చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా తిరిగి, రాష్ర్టాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండున్నరేండ్లకుపైగా పడుతుందని గత అనుభవాలు చెప్తున్నాయి. గతంలో 2001 సెన్సెస్ ఆధారంగా భారత ప్రభుత్వం 2002లో జస్టిస్ కుల్దీప్సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ 2007లో పార్లమెంటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఈ లెకన 2028 డిసెంబర్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికిగానీ, 2029 ఏప్రిల్, మే నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల నాటికిగాని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటుచేయడం అసాధ్యమని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఆరోజు వరకు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 153కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ఆశిస్తున్నాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎకడా లేదని, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)కి నిర్దేశించారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు చెప్తున్నారు. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టంచేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలోనూ తన వైఖరిని తేల్చిచెప్పింది. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. దీంతో 2028 అసెంబ్లీ ఎన్నికలకు, 2029 పార్లమెంటు ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదనే వాదనకు బలం చేకూరుతున్నది.