ఖమ్మం సిటీ, జనవరి 28: నలభై ఏండ్లుగా ఖమ్మం గ్రెయిన్ మార్కెట్‌ను, చిన్న చిన్న వృత్తులనే నమ్ముకొని బతుకీడుస్తున్న పేదలపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండా వారి ఇండ్లపైకి బుల్డోజర్ను పంపింది. అభివృద్ధి పేరుతో నివాసాలను నేలమట్టం చేసి ఆ అభాగ్యులకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇదీ ఖమ్మం జిల్లాకేంద్రంలో ని ప్రకాశ్‌నగర్-రావిచెట్టు బజార్ ప్రాంతంలో బుధవారం కార్పొరేషన్, పోలీసు అధికారుల దౌర్జన్యకాండ. ఖమ్మంలోని గ్రెయిన్ మార్కెట్‌కు, వెంకటగిరి క్రాస్ రోడ్డు మీదుగా ముదిగొండ లేదా కోదాడ బైపాస్కు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) యంత్రాంగం రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.
అలాగే బోనకల్లు ప్రాంతం నుంచి రైతులు అగ్రహారం మీదుగా తమ పంట ఉత్పత్తులను ఖమ్మంలోకి వెళ్లకుండా నేరుగా మార్కెట్‌కు చేరవేసుకోవచ్చనే ఆలోచనతో కేఎంసీ 28వ డివిజన్ ప్రకాశ్‌నగర్ శివారు రావిచెట్టు బజారులో రహదారి విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పచ్చజెండా ఊపడంతో అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. కానీ, ఆ ప్రాంతంలో మూడు నాలుగు దశాబ్దాల నుంచి నిరుపేదలు స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. అయితే వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. న్యాయస్థానాలకు వెళ్తారని భావించారో ఏమో.. నోటీసులు కూడా జారీ చేయలేదు. పదుల సంఖ్యలో జేసీబీలను పేదల ఇండ్ల మీదికి ఎగదోశారు. కనీసం ఇండ్లల్లోని సామగ్రిని కూడా బయటకు తీసే సమయం ఇవ్వకుండా అత్యంత కర్కశంగా కూల్చివేశారు.
పక్షవాతం, ఇతర జ బ్బులతో మంచం పట్టిన వారిని బలవంతంగా బయటకు తీసుకొచ్చి పడేశారు. మహిళలు, చి న్నారులు అనే కనికరం కూడా లేకుండా భయానక వాతావరణాన్ని సృష్టించి బుల్డోజర్లను ఎక్కుపెట్టారు. ఆగ్రహించిన కొందరు.. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే మోహరించిన వందలాది పోలీసులు వారిపై అత్యుత్సాహం ప్రదర్శించారు. లారీలు, వ్యాన్లు, జీపుల్లో అందరినీ బలవంతంగా అరెస్టు చేసి ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో విసుగెత్తిన బాధితులు ‘కాంగ్రెస్‌కు ఓట్లేసి తప్పు చేశాం.. మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చి మమ్ములను రోడ్డుపాలు చేశారు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి.. బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండె. వాళ్లను ఓడించి తప్పు చేశాం’ అంటూ కంటనీరు పెట్టుకున్నారు.