నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ మద్యం పాలసీతో పేదల ఆరోగ్యం పాడవుతుందని, పేదల కుటుంబాలే గుల్లవుతున్నాయని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో తన మద్యం పాలసీ వి షయంలో ప్రభుత్వ పెద్దలతో పాటు జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేసినట్టుగా వచ్చిన వార్తలపై రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఓ యూట్యూబ్ చానల్ లైవ్‌లో తీవ్రంగా స్పం దించారు. ‘అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది నిజం కాదా?’ అని ఎదురుదాడికి దిగారు. బెల్ట్ షాపుల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వ మే మాట తప్పిందని ఫైర్ అయ్యారు. ‘వ్యాపారులను మరింత ధనవంతులను చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తదా? ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తదా?’ నిలదీశారు.
ఒక్క వ్యాపారి కుటుంబం కోసం వెయ్యి కుటుంబాలను నాశనం చేసేలా మద్యం పాలసీ ఉన్నదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చానని, తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘నేను మంత్రినై ఉంటే ఈపాటికే రాష్ట్రం మొత్తం బెల్ట్‌షాపులపై నిషేధం ఉండేది. లోకల్‌బాడీ ఎన్నికలు ఎప్పు డో జరిగేవి’ అని చెప్పారు. ప్రభుత్వం తప్పు లు చేయొద్దంటడనే నాకు మంత్రి పదవి ఇస్తలేరేమో’ అని అనుమానం వ్యక్తంచేశారు. ఖమ్మంలో ముగ్గురు, కరీంనగర్లో నలుగురు మంత్రులు ఉండగా లేనిది నల్లగొండలో ముగ్గురు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఉన్న ఇద్దరూ నల్లగొండ లోక్‌సభ పరిధిలోని వాళ్లేనని, భువనగిరి పరిధిలో ఒక్క మంత్రి లేడు అని కొత్త వాదన తెరపైకి తెచ్చారు.