రెక్కాడితేగానీ డొక్కాడని జీవితాలకు ఆసరాగా నిలిచిన్రు.. మరొకరిపై ఆధారపడకుండా మా కాళ్లపై మేం నిలబడేలా దారి చూపిన్రు.. ఏండ్లుగా దారిద్య్రం అనుభవిస్తున్న మా కుటుంబాల్లో వెలుగులు నింపిన్రు.. రూ.10 లక్షల సాయమందించి మా తలరాత మార్చిన దేవుడు సీఎం కేసీఆర్.. అంటూ దళిత బంధు లబ్ధిదారులు సంబురంగా పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా తమను ఏ నాయకుడూ, ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదని, ఓట్ల కోసమే దళితులను వాడుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ గురించి పట్టించుకున్న దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దళిత బంధు కింద అందించే రూ.10 లక్షలతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. దళిత బంధు కింద అందజేసిన సొమ్ముతో తమకు చేతనైనది చేసి.. సీఎం చెప్పినట్టు అభివృద్ధి చెందుతామని.. జీవితాల్లో వెలుగులు నింపుకుంటామని భరోసాగా చెప్తున్నారు. సీఎం కేసీఆర్‌ను జీవితాంతం మరిచిపోమని.. దళితజాతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. – హుజూరాబాద్‌టౌన్/ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్/ వీణవంక/కమలాపూర్ రూరల్ (పరకాల)
మా కష్టాలు తీర్చే దేవుడు
మా బతుకులు దుర్భరం. సుట్టూ నాలుగు కర్రలు పెట్టి.. పైన ప్లాస్టిక్ కవర్లు కప్పినం. ఇగో గిదే మా గుడిసె. కైకిలి పోతెనే బువ్వ దొరికేది. ఈ మధ్య పానం మంచిగుంటలేదు. ఇంటికాడనే ఉంటున్న. నా భర్త మొగిలి ఊర్ల బర్ల కాస్తడు. నెలచ్చేసరికిగా పైసలు ఎటూ సరిపోవు. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ మాకు రూ.10 లక్షలు ఇత్తరని సార్లు చెప్పిన్రు. నిజంగ నమ్మలే. ఇగ మా కష్టాలు తీరినట్లే. సీఎం కేసీఆర్ సారే ఇయ్యాళ మాకు దేవుడైండు. గా పైసలతో బర్లు కొనుక్కుంట. తలదాచుకునేందుకు ఇల్లు కట్టుకుంట. కష్టపడి మా జీవితాన్ని మార్చుకుంట. –కొత్తూరి జయ, ఇల్లందకుంట
పాలేరు బతుకు పోతది
నా భర్త పాలేరు. నేను కైకిలికి పోత. పోయినేడాది పెద్దబిడ్డ పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష ఇచ్చిన్రు. బాకీలు కట్టినం. ఇంకొంత బాకీ ఉంది. అష్టకష్టాలు పడుతూ బతుకులు ఎల్లదీస్తున్నం. మా అదృష్టం గింతే అనుకున్నం. కానీ, సీఎం కేసీఆర్ సార్ దళితబంధుతో చీకట్లో ఉన్న మా బతుకుల్లో వెలుగులు తీసుకొస్తున్నడు. మాకు రూ.10 లక్షలు మంజూరు చేసిన్రు. నాకు.. నా భర్తకు సదువు రాదు. ఈ పైసలతోని బర్రెలు కొనుక్కుంటం. పాలు అమ్ముకుంటం. గింత గొప్ప సాయంచేసిన సీఎం సార్‌కు కోటి దండాలు. -దాసారపు స్వరూప, వీణవంక
దళితబంధు మరిచిపోలేం
మాకు ఇల్లు తప్ప గుంట భూమి లేదు. నేను, నాభార్య, కొడుకు రోజూ కూలీ పనిచేస్తం. బిడ్డలిద్దరు చదువుకుంటరు. కూలి పైసలతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తన్నం. ఇప్పటి దాకా మాలాంటోళ్లను ఆదుకున్న సర్కారు లేదు. ఇప్పుడు దళితుల కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకం మరిచిపోలేనిది. బతికినన్ని రోజులు కేసీఆర్ సార్‌కు మొక్కుతం. ఆయన చేతుల మీదుగా రూ.10 లక్షలు అందుకోవడం జన్మధన్యమైంది. –మాట్ల మణెమ్మ సుభాశ్, కమలాపూర్
లారో.. కారో.. కొనుక్కుంట
మా ఇద్దరు పిల్లలు. సదువుకుంటన్రు. నా భార్య కూలికి పోతది. నేను డ్రైవర్గ పనిజేత్తున్న. ఏదన్న బండి కొనుక్కుందామంటే ఒక్క పైసకు రాదాయే. ఏం జేద్దామని బాధపడేటోళ్లం. ఇగ మాకు దారి దొరికింది. సీఎం సారు దళితబంధు పెట్టిండు. అత్తది గనీ, ఎప్పుడత్తదో అనుకున్న. రానే అచ్చింది. సారు సేతుల మీద తీసుకున్న. లారో.. కారో, ట్రాక్టరో కొనుక్కుంట. మావోళ్లను పోషించుకుంట. –రాచపెల్లి శంకర్, శాయంపేట, జమ్మికుంట
అవ్వ.. అయ్యా జేయని సాయం చేసిండు
రోజూ కూలీ చేసుకుంటెనే బుక్కెడు బువ్వ దొరుకుతది. ఏ దేవుడు పంపించిండోగానీ సీఎం కేసీఆర్ సారు మా బతుకులు మార్చాలని దళితబంధు తెచ్చి కొత్త రాతరాస్తున్నడు. అవ్వ.. అయ్యా జేయని సాయం జేస్తున్నడు. రూ.10 లక్షలు ఇత్తరని అనుకోలే. దళితులను ఇప్పటిదాకా ఏ నాయకుడు పట్టించుకోలే. ఎవ్వరైనా చిన్న జాతిని చిన్నచూపు చూసెటోళ్లే. కానీ, సీఎం సార్ దళితులకు దేవుడైండు. మాకిచ్చిన పైసలతో ట్రాక్టర్ కొనుక్కుంటం. గా పైసలతో మంచిగ బతుకుతం. సీఎం సారు జేసిన సాయానికి ఖరీదు కట్టలేం. –ఎల్కపెల్లి కొమురమ్మ, చల్లూరు, వీణవంక
డెయిరీఫాం పెట్టుకుంటం
నాకు ముగ్గురు బిడ్డలు. మాకున్న ఇంటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నం. కూలి చేసుకుంటెనే మాకు బతుకు. ఇంతకుముందు ఏ సర్కారు మాకేం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ సారు దళితబంధు పథకం పెట్టి పది లక్షలు ఇస్తున్నరు. జీవితాంతం గుర్తుంచుకుంటం. సార్‌ను మా దేవునోలె కొలుస్తాం. ఈ పైసలతో డెయిరీఫాం పెట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటం. –కొత్తూరి రాధ-మొగిళి, కనుకులగిద్ద, హుజూరాబాద్
నాడు అంబేద్కర్.. నేడు కేసీఆర్
ఎవరెవరో నాయకులు వచ్చి హామీలిచ్చుడే తప్ప తీర్చింది లేదు.. దీంతో మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నయి. నాడు అంబేద్కర్ మా బతుకులు మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేసిండు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ ఒక్కరే మా గురించి ఆలోచిస్తున్నరు. మా పేదరికాన్ని గుర్తించి దళితబంధు ఇవ్వడం సంతోషంగా ఉంది. మా బతుకులు మారబోతున్నయి. సార్ ఇచ్చిన పైసలతోని ఏదో ఒక షాపు పెట్టుకుంటం. సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటం. –శనిగరపు సరోజన, మామిండ్లవాడ, హుజూరాబాద్ టౌన్
తండ్రిలాగా అర్థం చేసుకున్నరు
నా భర్త రవీందర్‌కు పక్షవాతమొచ్చి మంచంలనే ఉంటున్నడు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఇచ్చే పింఛన్లతోటి బతుకుతున్నం. కుటుంబ పోషణంతా నామీదే పడ్డది. పైసలు సరిపోక నేను పెట్రోల్ బంకుల పనిచేస్తున్న.. తండ్రిలాగా కేసీఆర్ సార్ మమ్మల్ని, మా బాధల్ని అర్థం చేసుకున్నరు. నాకు దళితబంధు సాంక్షన్ అయిందని సార్లు చెప్పిన్రు. సార్‌కు పాదాభివందనం చేయాలనుంది. ఈ పైసలతోని ఏదో ఒక షాపు పెట్టుకుని బతుకుతం. –రొంటాల సరిత, గాంధీనగర్, హుజూరాబాద్‌టౌన్
ట్రాక్టర్ కొనుక్కొని బతుకుతం
మాకు పదహారు గుంటల భూమి ఉంది. మా కొడుకు దిలీప్‌తో కలిసి కూలిపని చేసుకుంటున్నం. రేకుల షెడ్డులో బతుకుతున్నం. కేసీఆర్ సార్ దళిత బంధు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ పైసలతో ట్రాక్టర్ కొనుక్కుంటం. దానితో ఉన్న భూమితోపాటు ఇంకింత కౌలుకు తీసుకుని ఎవుసం చేసుకుంట మంచిగ బతుకుతం. సారుకు ఎల్లకాలం రుణ పడి ఉంటం.
-కనకం అనిత రవీందర్, కన్నూరు, (కమలాపూర్)