నిజామాబాద్, ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకుంది. మొత్తం 60 డివిజన్లకు 28 స్థానాల్లో బీజేపీ గెలిపిచినప్పటికీ ఎంపీ అర్వింద్ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రెస్మీట్లో ధర్మపురి అర్వింద్ ప్రకటించడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయినైట్లెంది. బీజేపీకి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, లోక్‌సభ సభ్యుడు అర్వింద్‌లకు సంబంధించిన ఎక్స్ అఫిషియా ఓట్లు కలిసి వస్తున్నాయి.
ఒకరు లేదా ఇద్దరి ఓట్లు అవసరం వస్తుండటంతో చేసేది లేక బీజేపీ చేతులు ఎత్తేసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఓటు కీలకంగా మారడంతో శుక్రవారం రాత్రంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర సమితి పార్టీ బీ-ఫామ్‌పై గెలిచిన 37వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మీని తమవైపు తిప్పుకునేందుకు బేరసారాలు నడిపారు. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటికి బీజేపీ శ్రేణులు వరుస కట్టారు. బుజ్జగింపులు, ఇతరత్రా మాటలు చెప్పి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికకు మద్ధతును కోరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సైతం వరుస కట్టారు.
కాంగ్రెస్‌లో ఏడుగురు పోటీ…
జనరల్ మహిళకు నిజామాబాద్ మేయర్ పదవి రిజర్వేషన్ కాబడింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17, ఎంఐఎం 14, బీజేపీ 28, బీఆర్ఎస్ 1 చొప్పున గెలుపొందాయి. బీజేపీ బరిలో ఉండకపోవడంతో కాంగ్రెస్ పార్టీకే మేయర్ పీఠం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం పార్టీకి స్నేహపూర్వకంగా మెదులుతున్న ఎంఐఎం పార్టీకి డిప్యూటి మేయర్ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మేయర్ పదవి కాస్తా మహిళకు రిజర్వ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఏడుగురు మాత్రమే మహిళా కార్పొరేటర్లు గెలుపొందారు. ఆది నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న శమంత నరేందర్ రెడ్డి ఓటమి చెందడంతో అనూహ్యంగా పోటీలో లేని వ్యక్తులకు కీలకమైన పదవి దక్కించుకునే వీలు ఏర్పడింది. 9వ డివిజన్ నుంచి సురేఖ, 11 డివిజన్ నుంచి ఫరీన్ బేగం, 12 డివిజన్ నుంచి అరుంధతి, 21వ డివిజన్ నుంచి లలిత, 33 డివిజన్ నుంచి ఫారానాజ్, 41 డివిజన్ నుంచి పూజిత, 49 డివిజన్ నుంచి ఉమారాణిలు ఉన్నారు. వీరిలో లలిత, పూజిత గౌడ్‌లలో ఒకరికి పదవి కట్టబెట్టాలని పీసీసీ చీఫ్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు లైన్ క్లియర్..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికపై రాజకీయం రసవత్తరంగా నడిచింది. శనివారం నాటికి బీజేపీ ఎంపీ చేసిన ప్రకటనతో ఉత్కంఠకు తెర పడింది. ఏ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది? అన్న సస్పెన్స్ ఒక్కసారిగా తుస్సుమన్నట్లు అయ్యిందంటూ బీజేపీ నేతలే గుసగుసలాడుతున్నారు. బీజేపీకి రాజకీయ శత్రువు, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అర్వింద్ చుక్కలు చూపిస్తారని అంతా ఊహించారు. మేయర్ బరిలో నిలిచి రాజకీయాన్ని రసవత్తరంగా కొనసాగిస్తారని ప్రజలంతా భావించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒకట్రెండు ఓట్ల తేడానే నెలకొంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమ పార్టీ ప్రతిపక్షంగానే ఉంటుందని అధికారికంగా చెప్పడంతో కాంగ్రెస్‌కు లైన్ క్లియర్ చేసినట్లు అయ్యిందని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు.