ధర్మారం : నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. వైద్యం అందక కండ్ల ముందే కన్నకొడుకు నరకయాతన అనుభవిస్తుంటే ఆ తల్లిదండ్రులు నిత్య క్షోభను అనుభవిస్తున్నారు. నవ మాసాలు మోసి, కనిపెంచిన కొడుకును కాపాడుకునేందుక ఆ తల్లి హృదయం తల్లిడిల్లింది. తన కిడ్నీని సైతం ఇచ్చేందుకు ముదుకొచ్చింది. కానీ, పేదరికం ముందు ఆ మాతృమూర్తి ప్రేమ ఓడిపోయింది. మానవా దృక్పథం స్పందించి తమ బిడ్డను కాపాడాలని ఆ తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు. ఈ హృదయవిదాకర సంఘటన పెద్దపల్లి(Peddapalli)జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..గోదావరిఖని బస్ స్టాండ్ కాలనీకి చెందిన దోనుగు రవీంద్ర, సృజన నిరుపేద దంపతుల కుమారుడు హర్షవర్ధన్(9) కిడ్నీ ఎదుగుదల(Child kidney failure) సరిగా లేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే బాబు వైద్యం కోసం అప్పులు చేసి రూ.6లక్షల వరకు ఖర్చు చేశారు. నెల నెలా మందుల ఖర్చులకు రూ.6వేలు సమకూర్చడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తల్లి సృజన కొడుకుకు తన కిడ్నీ దానం చేయడానికి నిర్ణయించుకుంది. కానీ, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం లక్షల్లో ఖర్చు కానుండడంతో దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్నారు.
బాబు పరిస్థితి తెలిసి ఎన్టీపీసీలోని శ్రీసీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ చలించి పోయారు. వెంటనే సోషల్ మీడియా ద్వారా బాబును దాతలు ఆదుకోవాలని కోరారు. దీంతో స్పందించిన దాతలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంగళవారం శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షు రాలు చంద్రకళ ఆధ్వర్యంలో సభ్యులు కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమ, జనగామ రాజేశ్వరి ద్వారా బాధిత బాబుకు రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందించి ధైర్యం కల్పించారు. బాబును ఆదుకోవడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మనతావాదులు స్పందించి ముందుకు రావాలని చంద్రకళ కోరారు.