Ponnam Prabhakar | (స్పెషల్ టాస్క్ బ్యూరో): హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ అధికార పక్షాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.
ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా-ఈ కారు రేస్ వంటి పసలేని కేసులతో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, గులాబీ నేతలకు ప్రజల మద్దతు అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. దీంతో కేటీఆర్, హరీశ్ దూకుడును తట్టుకోలేక.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొరపెట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
గన్‌పార్క్ వద్ద గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌ను అదుపులో పెట్టాలంటూ కేసీఆర్‌ను ఆయన వేడుకొన్నారు. ‘నేను పెద్దాయన చంద్రశేఖర్‌రావు గారిని కోరుతున్నా. ఒక్కసారి వీళ్లను (కేటీఆర్, హరీశ్‌ను) అదుపులో పెట్టుకోండి. లేకుంటే, మీకు చెడ్డపేరు వస్తుంది’ అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే దీనంగా కేసీఆర్‌కు పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్, హరీశ్ సెగ తాళలేకనే మంత్రి ఇలా కేసీఆర్‌కు మొర పెట్టుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.