బెంగళూరు: ఎన్నికల సంఘం (ఈసీ) చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ‘ఫారం-7’ దరఖాస్తుల ద్వారా మైనారిటీ వర్గానికి చెందిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. బూత్ స్థాయి ఏజెంట్ ఫిర్యాదుతో బీజేపీ నేతతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (Case against BJP leader) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 22న బీజేపీ నేత రవి పాటిల్ మరో 25 మందితో కలిసి, బెళగావి నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వార్డు నంబర్ 12లో బూత్ స్థాయి ఏజెంట్‌గా పనిచేస్తున్న మీరాసాబ్ సనదిని సంప్రదించారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఒక పేరును చేర్చడం లేదా తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఉపయోగించే ‘ఫారం-7’ దరఖాస్తుల ద్వారా ముస్లిం వర్గానికి చెందిన 198 మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వారు ప్రయత్నించారు.
కాగా, నకిలీ పత్రాలను సృష్టించి, అవి అసలైనవిగా, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) జారీ చేసినట్లుగా వారు తప్పుగా పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారికి (బీఎల్వో)కు వాటిని సమర్పించడంతో పాటు ఒత్తిడి తెచ్చారు. మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడించి ఈఆర్వోగా నమ్మించారు. ముస్లిం వర్గానికి చెందిన 198 మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వినియోగించిన ‘ఫారం-7’ దరఖాస్తులపై సంతకాలు తీసుకున్నారు.
అయితే బీజేపీ నేత రవి పాటిల్, ఇతర వ్యక్తులు సమర్పించిన ‘ఫారం-7’ దరఖాస్తుల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుసుకుని బూత్ స్థాయి ఏజెంట్ మీరాసాబ్ సనది షాక్ అయ్యారు. కేవలం ముస్లిం వర్గానికి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్న లక్ష్యంతో వారు కుట్ర పన్నడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా వారిలో ఆగ్రహం రగిలించి తద్వారా హింస, శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితులను సృష్టించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత రవి పాటిల్‌తో పాటు మరి కొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బెళగావి పోలీస్ అధికారి తెలిపారు. అయితే ముస్లిం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ‘ఫారం-7’ దరఖాస్తులను ఉపయోగించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో బీదర్, మైసూరులో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.