హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని బీసీలపై బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నదని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీల నోటికాడి బువ్వను దూరం చేయొద్దని కోరారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని అకారణంగా తొలగించారని, బీసీ నాయకుడు కావడం వల్లే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు ప్రభుత్వం మార్గం సుగుమం చేస్తున్నదని, అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.